: కాశీ విశ్వేశ్వరుడికి కల్తీ పాల బాధ... ఇకపై అభిషేకానికి బ్రాండెడ్ పాలే!
హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేతం కాశీ. ఈ నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా శతాబ్దాల నుంచి భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ప్రతీ హిందువు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుడుని దర్శించాలనుకుంటాడు. విశ్వానికి అధిపతి అయిన కాశీ విశ్వేశ్వరుడు తాజాగా, కల్తీ పాలతో బాధపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే, కాశీ విశ్వేశ్వర లింగం అభిషేకానికి భక్తులు తీసుకువస్తున్న పాలు... 80 శాతం కల్తీ పాలని ఆలయ అధికారులు నిర్ధారించారు. ఆలయం చుట్టుప్రక్కల వ్యాపారులు ఎక్కువగా కల్తీ పాలను భక్తులకు అమ్ముతున్నారని... వీటిలో అనేక రకాల రసాయన పదార్థాలు, విష పదార్థాలు ఉంటున్నాయని వారు తెలిపారు. శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత... దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తున్నామన్నారు. కల్తీ పాల వల్ల లింగం దెబ్బతినే అవకాశాలు ఉండటంతో పాటు... ఆ పాలనే ప్రసాదంగా ఇవ్వటం వల్ల భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో, బయట కొనుగోలు చేసే పాలను వచ్చేవారం నుంచి కాశీ దేవస్థానం నిషేధించింది. ఇకపై కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేయాలంటే భక్తులు స్థానిక ప్రభుత్వ రంగ పాల సంస్థ అయిన పరాగ్ డైరీ పాలనే కొనుగోలు చేయాలి. ఈ మేరకు, కాశీ దేవస్థానం పరాగ్ డైరీ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, భక్తులకు అతి చౌకగా రూ.5, రూ.10 లకు 'పరాగ్' డైరీ సంస్థ వచ్చే వారం నుంచి పాల ప్యాకెట్లను అమ్మనుంది. దీనికోసం, ఆలయ పరిసరాల్లోని స్టోర్స్ ను దేవస్థానం పరాగ్ డైరీకి కేటాయించనుంది. ఇకపై, పరాగ్ డైరీ బ్రాండెడ్ పాలు కాకుండా, బయట కొనుగోలు చేసిన పాలతో ఎవరైనా ఆలయంలోకి ప్రవేశిస్తే... వారు అభిషేకం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించదు.