: బీజేపీ ప్రభుత్వంలో చేరేదీ, లేనిదీ నేడు తేల్చి చెప్పనున్న శివసేన
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు నేడు తెరపడనుంది. బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తాము చేరేదీ లేనిదీ నేడు శివసేన తేల్చి చెప్పనుంది. నిన్న విస్తృతంగా సమాలోచనలు చేసిన శివసేన అధిష్ఠానం... నేడు తన తుది నిర్ణయాన్ని వెల్లడించనుందని ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని అధినేత ఉద్ధవ్ థాకరే స్వయంగా వెల్లడిస్తారని తెలిపారు. మరోవైపు, ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవానికి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు కూడా ఆహ్వానం అందింది.