: దేశంలో నోబెల్ బహుమతి దక్కించుకునే అర్హత ఒక్క చంద్రబాబుకే ఉంది!: కేసీఆర్
నిన్న హైదరాబాదు మీర్ పేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ చంద్రబాబు టార్గెట్ గా సుదీర్థ ప్రసంగం చేశారు. చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడడం తనకిష్టం లేదంటూనే ఆయనపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఆంధ్రా పార్టీల నాయకులు ఇంకా కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. తామింకా గోచీ సర్దుకోకముందే టీడీపీ, కాంగ్రెస్ లు విమర్శల దాడులు చేస్తున్నాయన్నారు. లక్షమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తెలంగాణలోని తన తొత్తులతో ఆందోళనలు, విమర్శలు చేయించి తమను బద్ నామ్ చేయడానికి చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. మాట మార్చడంలో ఒక్క చంద్రబాబుకు మాత్రమే దేశం మొత్తం మీద నోబెల్ బహుమతి దక్కించుకునే అర్హత ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 1.54 లక్షల కోట్ల రుణ మాఫీ సాధ్యం కాదని నిపుణులు అంటే...''మీరు బచ్చాలు...మీకు ఏమీ తెలియదు...నెేను పెద్ద ఎకానమిస్ట్ ను...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను..రుణమాఫీ చేసి చూపిస్తా'' అంటూ ప్రగల్భాలు పలికారని ఆయన అన్నారు. తీరా ముఖ్యమంత్రి అయ్యి నాలుగు నెలలు పూర్తయినా, లక్ష పైసలు కూడా మాఫీ చేయలేకపోయారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీని ఎగ్గొట్టేందుకు చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమను విమర్శించే ముందు ఒకసారి తన పరిపాలన గురించి చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.