: భారత్ లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది... కార్పొరేటర్ ముఖ్యమంత్రి అయ్యాడు


సువిశాల భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. 'చాయ్ వాలా' ట్యాగ్ లైన్ తో మోదీ ప్రధాని అయితే, సాధారణ కార్పొరేటర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై భారతదేశంలో ప్రజాస్వామ్యానికి కొత్తభాష్యం చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్ (44) 22 ఏళ్ల వయసులో నాగ్ పూర్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అనంతరం అత్యంత చిన్నవయసులో మేయర్ గా ఎన్నికైన వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కారు. దేవేంద్ర ఫడ్నవీస్ విదర్భ ప్రాంతంలో చంద్రపూర్ జిల్లా సావలీ తాలుకాలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్ నేత. తదనంతర కాలంలో ఆయన బీజేపీ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. విదర్భ జనసంఘ్ (బీజేపీ) ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. గంగాధర్ ను రాజకీయ గురువుగా పేర్కొంటారు. ఇక ఫడ్నవీస్ పిన్ని (చిన్నమ్మ) శోభాతాయి ఫడ్నవీస్ నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ కు తండ్రి, చిన్నమ్మ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. 17 ఏళ్ల వయసులో ఉండగా తండ్రి కన్ను మూశారు. ఆయన వారసుడిగా ఫడ్నవీస్ రాజకీయ రంగప్రవేశం చేశారు. నాగ్ పూర్ లా కళాశాల నుంచి పట్టభద్రుడైన దేవేంద్ర ఫడ్నవీస్, బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ చేశారు. ఆయన పలు పుస్తకాలను కూడా రచించారు. నాగ్ పూర్ కు చెందిన బ్యాంకు మేనేజర్ అమృతను వివాహమాడిన ఫడ్నవీస్ మృదుభాషిగా పేరొందారు. ఇప్పటి వరకు ఫడ్నవీస్ పై అవినీతి ఆరోపణలు లేవు. చిన్న వయసులోనే ఆరెస్సెస్ లో చేరిన ఫడ్నవీస్, బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1997లో నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 27 ఏళ్ల వయసులో మేయర్ గా ఎన్నికయ్యారు. 29 ఏళ్ల వయసులో 1999లో శాసనసభకు ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఆయన ప్రస్తుతం నాగ్ పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2001లో బీజేపీ జాతీయ యువమోర్చా ఉపాధ్యక్షుడిగా, 2010లో మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2013లో మహారాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News