: ఇక నేను భారత జట్టుకు ఆడలేనేమో!: యువరాజ్ సింగ్
గత వన్డే వరల్డ్ కప్ లో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. క్యాన్సర్ కారణంగా కొంతకాలం ఆటకు విరామం ప్రకటించిన యువీ, కోలుకున్న అనంతరం పూర్వపు టచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. మరోవైపు, యువ ఆటగాళ్ళ జోరు పెరగడం కూడా యువరాజ్ కు టీమిండియా బెర్తు దూరమవ్వడానికి కారణమైంది. తాజాగా, ఈ స్టయిలిష్ లెఫ్ట్ హ్యాండర్ 'విజ్డెన్ ఇండియా'తో మాట్లాడుతూ, ఇక తాను టీమిండియాకు ఆడలేకపోవచ్చేమోనని అభిప్రాయపడ్డాడు. కానీ, భారత జట్టుకు మళ్ళీ ఎంపికవ్వాలన్నది తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఆ లక్ష్యమే ఇప్పుడు తనను ముందుకు నడిపిస్తోందని అన్నాడు. ఏదేమైనా, తాను భారత జట్టులో స్థానం సంపాదించుకోగలిగితే, అది గొప్ప విషయమేనన్నాడు. "వరల్డ్ కప్ సమీపిస్తోంది. ఫామ్ నిరూపించుకోవడానికి దేశవాళీల్లో ఎక్కువ అవకాశాలు లేవు. అందుకే, సాధ్యమైనంత మేర సన్నద్ధమవడం ద్వారా అవకాశాలను చేజిక్కించుకునేందుకు యత్నిస్తాను" అని వివరించాడు.