: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పొత్తుల్లేవు... అన్ని పార్టీలదీ ఒంటరి పోరే!
జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ కొత్త ట్రెండ్ ఇప్పడు జమ్మూ కాశ్మీర్ లోనూ కొనసాగనుంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ... పార్టీలన్నీ ఇంకా మేనిఫెస్టో తయారు, అభ్యర్థుల ఎంపిక వంటి పనుల్లో నిమగ్నమయ్యాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీలు రాష్ట్రంలోని మొత్తం 87 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. పాత మిత్రులైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు పొత్తు విషయంపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో, ఈ రెండు పార్టీలు కూడా ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయనే అంచనాలు బలపడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ఒకరు చెప్పడం గమనార్హం. వీటితో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలైన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), జేకేఎన్ పీపీలు కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి.