: చైనా అభ్యంతరాలు బేఖాతరు... వియత్నాంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం కొనసాగించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సముద్ర పరిధిలోకి వచ్చే ఇతర దేశాలను భయపెట్టి అయినా సరే తన పెత్తనమే కొనసాగించాలనేది చైనా నైజం. అలాంటి చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలను పెంపొందించేందుకు వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి గుయెన్ టాన్ డుంగ్, భారత ప్రధాని మోదీ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వియత్నాం ప్రాదేశికంలోని దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే మూడు చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలను భారత్ నిర్వహిస్తోంది. కొత్తగా మరొక చమురు, సహజవాయువు బ్లాకులో అన్వేషణకు ఒప్పందం కుదిరింది. దీనికి తోడు, మరో చమురు ప్రాజెక్టు కాంట్రాక్టును పొడిగిస్తూ ఇంకో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే దీనిపై చైనా స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో ఎలాంటి అన్వేషణ కార్యక్రమాలైనా తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉంటే... అలాంటి వాటిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించింది. ఇలాంటి హెచ్చరికలు వస్తాయని భారత్ ముందే ఊహించింది. చైనా బలుపును తగ్గించాలనే ధోరణిలో మోదీ సర్కారు ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఇరు దేశాల ప్రధానమంత్రుల భేటీలో... పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య, అంతరిక్ష, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం తదితర అంశాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు, వియత్నాంకు మధ్య వివాదం కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు నావికాదళ గస్తీ నౌకలను వియత్నాంకు భారత్ సరఫరా చేయనుంది. అలాగే, ఆ దేశ సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చి, వారిని బలోపేతం చేయనుంది. బలప్రయోగాలకు పాల్పడకుండా... సముద్ర ప్రాంత వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి పరిష్కరించుకోవాలని భారత్, వియత్నాంలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. భారత్, వియత్నాంల ఒప్పందాలన్నీ చైనాకు పుండు మీద కారం చల్లినట్టు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.