: ఎస్ బీహెచ్ ఫలితాలు అదుర్స్: వ్యాపారం పెరగకుండానే రెట్టింపు దిశగా లాభాలు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్... ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎవ్వరూ ఊహించని ఫలితాలను నమోదు చేసింది. వ్యాపారంలో ఇసుమంత వృద్ధిని కూడా నమోదు చేయని ఆ బ్యాంక్, లాభాన్ని మాత్రం దాదాపుగా రెట్టింపు చేసుకుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించిన పలితాలను బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. గతేడాది ఇదే కాలానికి కేవలం రూ.163 కోట్ల లాభాన్ని సాధించిన ఎస్ బీహెచ్, తాజాగా రూ.311 కోట్ల మేర నికర లాభాన్ని ప్రకటించింది. అదే సమయంలో తన వ్యాపారంలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదని వెల్లడించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. మరింత మేర లాభాలను ఆర్జించేందుకు అధిక వడ్డీ రేట్లతో కూడిన డిపాజిట్లు, తక్కువ వడ్డీ రేట్లున్న రుణాలకు దూరంగా ఉన్నందునే ఈ మేర ఫలితాలను నమోదు చేసినట్లు బ్యాంక్ ఎండీ శంతను ముఖర్జీ చెప్పారు. నిరర్థక ఆస్తులను అసెట్ రీ కన్ స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించడం ద్వారా నానాటికీ పెరుగుతున్న మొండి బకాయిల భారాన్ని తగ్గించుకుంటున్నామని ఆయన వెల్లడించారు.