: ఇక రోజంతా సభా సమావేశాలు: తెలంగాణ ప్రభుత్వం
మునుపటి సంప్రదాయాలకు భిన్నంగా వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ పాత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చేశారు. శాసనసభలో అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో సమావేశాలను రోజంతా నిర్వహించేందుకు తీర్మానించారు. సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి అసెంబ్లీ సమావేశాలు ఒక్క పూట మాత్రమే జరుగుతాయి. అందుకు భిన్నంగా తెలంగాణ శాసనసభను రోజంతా సమావేశపరిచి, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణపై మంగళవారం రాత్రి మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తదితరులతో భేటీ అయిన ఆయన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇకపై సమావేశాలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించడంతో పాటు శనివారం కూడా సమావేశాలు కొనసాగించనున్నారు. గత సంప్రదాయాలకు భిన్నంగా సమావేశాల తొలిరోజే రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యతో బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరగడమే కాక ప్రజలకు తాము సమగ్రమైన వివరణ ఇచ్చేందుకు అవకాశం చిక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. సభలో ప్రతి ఎమ్మెల్యే, తన నియోజకవర్గ సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.