: మీ అబద్ధాల డైలీ సీరియల్ ఇక ఆపండి, బాబూ!: తెలంగాణ మంత్రులకు పరకాల చురక
చెప్పిన అబద్ధాలనే తెలంగాణ నేతలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మంత్రి హరీష్ రావు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారన్నారు. '69 జీవో'లో చెప్పిన అంశాన్నే '233 జీవో'లో నొక్కి చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తించాలని కోరారు. తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్ గా చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చన్న పదమేలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లిష్ భాషా పండితులైన హరీష్ రావుగారే మరోసారి జీవోను చదువుకోవాలని సూచించారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా హరీష్ రావుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఏదో ఒక పేపర్ తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే నిజమైపోతుందా? అని ఆయన నిలదీశారు. కాసేపు సాగునీరు, తాగునీరు, విద్యుత్... ఇలా ప్రతి అంశంపై ఏదో ఒక వివాదం రాజేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ రావాలని తెలంగాణ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి, ఎలా రావాలని ఆయన అడిగారు.