: బిలావల్ భుట్టోకు బ్రిటిషర్లు బుద్ధి చెప్పారు!


పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీకి బ్రిటిషర్లు బుద్ధి చెప్పారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకు ఆయన వేసిన పన్నాగాన్ని ప్లాస్టిక్ బాటిళ్లు విసిరి మరీ గుణపాఠం నేర్పారు. ఇంతకీ విషయమేమిటంటే, కాశ్మీర్ వివాదం పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలన్న డిమాండ్ తో లండన్ లో ఆదివారం ‘మిలియన్ మార్చ్’ పేరిట ఓ ప్రదర్శన జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానిగా అనుచరులు పిలుచుకునే సుల్తాన్ మహ్మూద్ ఛౌధ్రీ ఈ ప్రదర్శనకు రూపకల్పన చేశారు. ఇందులో పాల్గొని కాశ్మీర్ అంశంపై ప్రసంగించాలని బిలావల్ నిర్ణయించుకున్నారు. అయితే అతడి పన్నాగం ఫలించకపోగా ఘోర పరాభవాన్ని చవిచూశారు. మిలయన్ మార్చ్ కు పెద్ద సంఖ్యలో జనం పోగవుతారనుకుంటే, అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. అయినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్న బిలావల్ అక్కడికి చేరుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే, ఒక్కసారిగా ఆయనపై ప్లాస్టిక్ బాటిళ్లు వచ్చి పడ్డాయి. అవి కూడా అక్కడ గుమికూడిన వారి నుంచే రావడంతో ఒక్కసారిగా బిలావల్ ఖిన్నుడయ్యారు. "కాశ్మీర్ గురించి, కాశ్మీర్ ప్రజల గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నీకు ఇక్కడేం పని?" అంటూ బాటిళ్లు విసిరిన వారు నినదించారు. దీంతో వేదికనెక్కిన మరుక్షణమే అక్కడి నుంచి బిలావల్ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది ఎక్కడో ఇంగ్లండ్ మారుమూల ప్రాంతంలో కాదు. లండన్ నగరంలోని ప్రఖ్యాత డౌనింగ్ స్ట్రీట్ లోని ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద బిలావల్ కు ఈ పరాభవం ఎదురైంది. ఈ దెబ్బతో బిలావల్, ఇకపై కాశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేసేందుకు సాహసించకపోవచ్చు.

  • Loading...

More Telugu News