: హిందూ, ముస్లిం సోదర భావానికే ఆదర్శం వీరి బంధం!
హిందూ, ముస్లిం భాయి భాయి అని ఎంతో మంది మహానుభావులు చెప్పినప్పటికీ సోకాల్డ్ రాజకీయ నాయకుల వ్యాఖ్యల కారణంగా వివాదాలు రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అనారోగ్యం కారణంగా మృతి చెందిన రాఖీ సోదరికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి, మత సామరస్యానికి అసలు సిసలు భాష్యం చెప్పాడు ఓ ముస్లిం సోదరుడు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూందాపాండే అనే గ్రామానికి చెందిన యశోధరాదేవి 15 ఏళ్ల కిందట భర్తను కోల్పోయి తన తల్లి, కుమారుడితో కలసి ఓ గుడిసెలో జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన అస్లామ్ బేగ్ అనే ముస్లింను సోదరుడిగా యశోధరాదేవి భావించేది. ఆమె భర్తను కోల్పోయిన నాటి నుంచి ఓ అన్నగా ఆమె కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు. ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందింది. దీంతో యశోధరాదేవి అంతిమ సంస్కారాన్ని గంగానది ఒడ్డున శాస్త్రోక్తంగా నిర్వహించిన అస్లామ్ బేగ్ సోదర భావానికి సరికొత్త భాష్యం చెప్పాడు.