: ఎవరైనా 498-ఏ కేసు పెట్టారా? అయితే వెంటనే అరెస్టు చేసేయకండి: కేంద్ర హోం శాఖ
వరకట్న నిరోధక కేసులపై దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ పలు సూచనలు చేసింది. వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, భర్త తరపు బంధువులపై కేసులు పెట్టేందుకు దానిని వినియోగించుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, కేసు నమోదు చేసిన తరువాత పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన అనంతరం అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో కేంద్రప్రభుత్వం పలు సూచనలు చేసింది. 498ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేసినా...వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో 498ఏను కొంతమంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. కేసు నమోదు అయిన తరువాత పూర్వాపరాలు పరిశీలించి, అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు పోలీసులుకు తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.