: ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కు ‘బ్రాండ్ ఏపీ’ ప్రచార బాధ్యతలు!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు ఏపీ సీఈఓగా వ్యవహరించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో జరపనున్న పర్యటనను ఆయన ఇందుకు వేదికగా మలచుకుంటున్నారు. ఆ దేశాల్లో తన పర్యటన సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశాల ఏర్పాటు, ఏపీలోని అవకాశాలను అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించడం, తద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించే బృహత్తర బాధ్యతను చంద్రబాబు, గతంలో మాదిరే ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కు అప్పజెప్పారు. ఇందుకోసం ఏపీ సర్కారు ఆ సంస్థకు రూ.47 లక్షలను కన్సల్టింగ్ ఫీజుగా చెల్లించనుంది. ఈ మేరకు ఆ సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ప్రైస్ వాటర్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన నిరంతర విద్యుత్, ప్రభుత్వం అందిస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల నేపథ్యంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజాలను చంద్రబాబు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ దిశగా ఆయన చర్యలు కొంతమేర ఫలితాలను కూడా ఇచ్చాయి. ఇక సీఎం హోదాలో చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో చంద్రబాబు జరపనున్న పర్యటన భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ఖాయంగానే కనిపిస్తోంది.