: గౌస్ మోహిద్దీన్ డైరీలతో పోలీసు ఉన్నతాధికారుల్లో వణుకు!
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అరెస్టయిన అధ్యాపకుడు గౌస్ మోహిద్దీన్ కు సంబంధించిన డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు వెలుగు చూడటంతో ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చిన్న స్థాయి కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ దాకా పెద్ద సంఖ్యలో పోలీసులు పదోన్నతులు, బదిలీల కోసం గౌస్ ను ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు శాఖలో గౌస్ ఓ కీలక వ్యక్తిగా ఎదిగిన వైనంపై పోలీసు బాసులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ కేసులో గౌస్ కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గౌస్ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. గౌస్ కంప్యూటర్ నుంచి పలువురు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన కాన్పిడెన్షియల్ రిపోర్టులు కూడా లభ్యమైనట్లు సమాచారం. దీంతో సదరు నివేదికలను గౌస్ కు అందజేసిన పోలీసు అధికారుల్లో కలవరం మొదలైంది. ఈ కేసు దర్యాప్తులో తమ పేర్లు ఎక్కడ వెలుగు చూస్తాయోనని పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు.