: జగన్ పై విమర్శలు చేస్తే సహించం: వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. వాకతిప్ప బాధితులను పరామర్శించిన జగన్, వారికెలాంటి సహాయం అందించలేదని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ చేసిన ఆరోపణలపై స్పందించిన నెహ్రూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వాకతిప్ప పేలుడు ఘటన బాధితులకు ప్రభుత్వం ఏ మేరకు సహాయం ప్రకటించిందన్న దానిపై వర్మ మాట్లాడాలని నెహ్రూ సూచించారు. పార్టీ తరఫున బాధితులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారం దక్కితే, వాకతిప్ప బాధితులకు మాత్రం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించడాన్ని నెహ్రూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. వివక్ష చూపుతున్న సర్కారును వదిలి, జగన్ పై ఆరోపణలు చేయడాన్ని వర్మ మానుకోవాలని ఆయన సూచించారు.