: విద్యుత్ కొనుగోలు ఫైలు తిప్పి పంపలేదని చెప్పమనండి... ఆధారాలు బయటపెడతా!: రేవంత్ రెడ్డి
రాజకీయ సాధింపుల పేరిట ముఖ్యమంత్రి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాగి ఉన్నాడో లేదో తెలియదు కానీ, పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాత్రం అచ్చం తాగిన వ్యక్తిలా మాట్లాడారని అన్నారు. ల్యాంకో విద్యుత్ సంస్థ 150 మెగావాట్ల విద్యుత్ అమ్మడానికి సంసిద్ధత వ్యక్తం చేయగా, సీఎంవో అధికారులు ఆ ఫైలును సీఎం వద్దకు పంపితే, దానిని ఎందుకు తిప్పి పంపారో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లగడపాటితో ఉన్న రాజకీయ వైరం, లంచమివ్వలేదన్న కారణంగా ల్యాంకో నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆయన వివరించారు. కేసీఆర్ దీనిని అబద్ధమని చెబితే నిజమైన ఆధారాలు బయటపెడతానని రేవంత్ సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో 82 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ నష్టం జరిగిందని, దీంతో, తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 608 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని, దీనికి బాధ్యత ఏపీ సీఎం బాబు వహించాలని, లేని పక్షంలో కోర్టు కీడుస్తామని కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరీ అరిచి గీపెట్టాడని ఆయన విమర్శించారు. నిత్యం అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజలను టీడీపీపై కేసీఆర్ ఉసిగొల్పుతున్నాడని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే నిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటా దక్కలేదని ఓ పేపర్ పట్టుకుని నోటికొచ్చిన అబద్ధాలు కేసీఆర్ చెప్పాడని ఆయన ఆరోపించారు. ఒకే మీడియా సమావేశంలో కేసీఆర్ నాలుగు సార్లు మీడియా మిత్రులకు సారీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సారీ చెప్పడంతోనే వాస్తవం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఆయన చెప్పారు. కేసీఆర్ అబద్ధాలపై నిగ్గు తేల్చి వాస్తవాలు వెలుగులోకి తేనున్నట్టు ఆయన తెలిపారు. గత నాలుగున్నర నెలలుగా (జూన్ 18 నుంచి అక్టోబర్ 23 వరకు) మొత్తం 10,717 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,031 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకోగా, 5,686 మిలియన్ యూనిట్ల ధర్మల్ విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుందని ఆయన వివరించారు. అలాగే, నీటి ద్వారా 3,798 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా, 1571 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ వినియోగించుకోగా, తెలంగాణ 2226 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకుంది. ఆ విధంగా 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రం అదనంగా వినియోగించుకుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం విద్యుత్ లో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయి తెలంగాణకు త్యాగం చేయగా, తెలంగాణ రాష్ట్రం 273 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను అదనంగా వాడుకుందని ఆయన వివరించారు. ఈ లెక్కన నష్టపోయింది ఎవరు? లాభం పొందింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యల పరిష్కారానికి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండని అన్ని పార్టీలు చెబుతూనే ఉన్నాయని, అయినప్పటికీ దున్నపోతుమీద వర్షం పడ్డట్టు ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. సమస్యల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే బస్సు యాత్ర చేపట్టామని ఆయన వెల్లడించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ క్యాంపాఫీసులో కాలక్షేపం చేస్తూ... అధికారులను పండగల పేరు చెప్పి కల్లు కాంపౌండ్ల చుట్టూ తిప్పుతుంటే తప్పని టీడీపీ విమర్శించిందనీ, అలా విమర్శించడం తప్పా? అని ఆయన నిలదీశారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ 1490 కోట్ల రూపాయలు వెచ్చించి 900 మెగావాట్ల విద్యుత్ ను 5.73 పైసలు లెక్కన ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కుంటే, తెలంగాణ సీఎం మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విభజన సందర్భంగా ఆస్తులు, ఆప్పులు జనాభా ప్రాతిపదికన విభజించినా, విద్యుత్ కు కొత్త విధానం అమలు చేస్తే, సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై అభిమానంతో వినియోగం ప్రకారం విద్యుత్ విభజనను అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు. అలా బాబు అంగీకరించకపోయి ఉంటే తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా వచ్చిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు ఉదారత లేకుంటే, తెలంగాణ ప్రజలు ఎలా పోతే నాకెందుకు అనుకుని ఉంటే, జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి 42 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 58 శాతం విద్యుత్ కేటాయింపు జరిగేదని, అప్పుడు మరింత నష్టం జరిగేదని ఆయన వివరించారు.