: ఐదు నెలల అధికారంతోనే మోదీ కేబినెట్ లో కోటీశ్వరులు పెరిగారు!
కేవలం ఐదు నెలల పదవీ కాలంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కోటీశ్వరుల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాక అప్పటికే కోటీశ్వరులుగా ఉన్న మంత్రుల ఆస్తులు క్రమంగానే కాక శరవేగంగానూ పెరిగిపోయాయి. ప్రస్తుతం మోదీ కేబినెట్ లోని 45 మందిలో 41 మంది కోటీశ్వరులే. వీరందరిలోకి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడది ప్రత్యేక స్థానం. ఎందుకంటే, ఆయన ఆస్తి గడచిన ఐదు నెలల కాలంలోనే రెండు రెట్లకంటే ఎక్కువగా పెరిగిపోయింది. కేంద్ర మంత్రిగా పదవి చేపట్టకముందు రూ. 9.90 కోట్ల ఆస్తులున్న సదానంద గౌడ ఆస్తులు ప్రస్తుతం రూ.20.35 కోట్లకు పెరిగాయి. అంటే, కేవలం ఐదు నెలల వ్యవధిలో గౌడ ఆస్తి రూ.10.36 కోట్లు పెరిగిందన్నమాట. ఆ తర్వాత స్థానంలో భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో రూ.4.09 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి ప్రస్తుతం రూ.7.07 కోట్లకు పెరిగింది. ఇక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆస్తి మాత్రం కేవలం రూ.1 కోటి మాత్రమే పెరిగింది. గడచిన రెండేళ్ల కాల పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే, మోదీ కేబినెట్ లో సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ల ఆస్తులు వరుసగా 323, 212 శాతం మేర పెరిగాయి.