: వడ్డీ రేట్లు తగ్గితేనే అభివృద్ధి: అరుణ్ జైట్లీ
మోదీ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల తర్వాత తొలిసారిగా అరుణ్ జైట్లీ వడ్డీ రేట్లపై నోరు విప్పారు. వడ్డీ రేట్లు తగ్గితేనే అభివృద్ధి సాధ్యపడుతుందంటూ ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. "ప్రస్తుతం అమలవుతున్న వడ్డీ రేట్లు అంత ప్రోత్సాహకరంగా లేవు. దీంతో ద్రవ్యోల్బణం కూడా స్థిరంగానే కొనసాగుతోంది. వడ్డీ రేట్లను మార్చాల్సిన అవసరం ఆసన్నమైంది" అని ఆయన ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. "రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలంగా మార్చకుండానే కాలం నెట్టుకొస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రుణాలు తీసుకోవడంలో దేశ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతారు" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక మొండి బకాయిదారులకు రుణాలివ్వడాన్ని బ్యాంకులు మానుకోవడంతో పాటు, తమ నిరర్థక ఆస్తులను తగ్గించుకుంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని కూడా జైట్లీ అభిప్రాయపడ్డారు.