: రాజ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ లపై సోషల్ మీడియాలో సెటైర్ల జోరు!
మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. అసలే ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసిన మహరాష్ట్ర నవ నిర్మాణ సమితి, ఆ పార్టీ అధినేత రాజ్ ఠాక్రే తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీ హోదాకు తగ్గ స్థాయి ఓట్లను కూడా రాబట్టలేకపోవడంతో, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాజ్ ఠాక్రేకు తాజాగా సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీపై సెటైర్లు విసురుతున్న నెటిజన్లు, ఏకంగా రాజ్ ఠాక్రేపైనా నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. వాటిలో ఓ సెటైరికల్ పోస్టు ఇలా ఉంది. రాజ్ ఠాక్రే ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, నేను రాజ్ ఠాక్రేనంటాడు. ఆ ఇంటి యజమాని ఠాక్రే ఎవరంటూ ప్రతిస్పందిస్తాడు. మరో దాంట్లో, పార్టీ పేరును మార్చుకుంటే తప్ప, బతికి బట్ట కట్టే పరిస్థితి లేదంటూ మరో నెటిజన్ ఠాక్రేకు సూచించాడు. మరి ఈ విమర్శల జడి వాన నుంచి ఠాక్రే ఎలా బయటపడతాడో చూడాల్సిందే.