: ‘మహా’ సీఎం బరిలో నేను లేను: నితిన్ గడ్కరీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేనని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించి, దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం చేశారు. గడ్కరీకి సీఎం పదవి ఇవ్వకుంటే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా వెనుకాడనని పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించి కలకలం రేపారు. దీంతో, మహారాష్ట్ర సీఎం రేసులో నితిన్ గడ్కరీ పేరు కూడా ఉన్నపళంగా ముందు వరుసలోకి వచ్చింది. అయితే, ఈ తరహా ప్రచారంపై ఆయన గురువారం విస్పష్ట ప్రకటన చేశారు. మహారాష్ట్ర సీఎం బరిలో తాను లేనని, ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించానని కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో పార్టీకి కీలక నేతగా ఉన్న తనను పలువురు ఎమ్మెల్యేలు కలవడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. అంతమాత్రాన తాను సీఎం రేసులో ఉన్నానని అనుకోవడం సరికాదని ఆయన స్పష్టీకరించారు.