: తక్కువ బంతుల్లో సెంచరీ చేసి సెలక్టర్లను ఇరకాటంలోకి నెట్టిన 'బ్యాడ్ బాయ్'!


న్యూజిలాండ్ క్రికెటర్లలో బ్యాడ్ బాయ్ ఎవరంటే, క్రికెట్ పరిజ్ఞానమున్న ఎవరైనా 'జెస్సీ రైడర్' అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతటి ఘనమైన చరిత్ర రైడర్ సొంతం మరి! పెగ్గు ఫిక్స్ చేశాడంటే ఎవరికో మూడినట్టే! రేపు ఉదయం మ్యాచ్ ఉందంటే, వేకువజాము వరకు తప్పతాగి నానాయాగీ చేస్తాడు! ఎన్నోసార్లు బార్లలో గొడవలకు దిగి, కివీస్ క్రికెట్ బోర్డుతో అక్షింతలు వేయించుకోవడం రైడర్ కే చెల్లు. మొన్నటికి మొన్న, మందు కొట్టి వస్తుండగా, కొందరు దుండగులు రైడర్ ను దారుణంగా కొట్టారు. చావబోయి బతికాడు. కానీ, అతడి ప్రతిభ విస్మరించలేనిది. ఎన్నోసార్లు జట్టుకు దూరమైనా, వెంటనే బ్యాట్ కు పని చెప్పి మళ్ళీ జట్టు గడప తొక్కేవాడు. ఫిబ్రవరిలో జట్టు నుంచి ఉద్వాసనకు గురైన ఈ బ్యాడ్ బాయ్ మరోసారి సెలక్టర్లకు విషమ పరీక్ష పెట్టాడు. ఐర్లాండ్ తో వెల్లింగ్టన్ లో జరిగిన మ్యాచ్ లో కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన దేశవాళీ జట్టు ఒటాగో తరపున ఆడిన రైడర్ ఆ పోరులో మొత్తం 57 బంతుల్లో 8 సిక్సులు, 18 ఫోర్లతో 136 పరుగులు చేయడం విశేషం. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు రైడర్. ప్రస్తుతం కివీస్ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓటమిపాలవడంతో, రెండో వన్డేకు పటిష్ఠమైన జట్టును రంగంలోకి దింపాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సూపర్ సెంచరీతో ఫామ్ చాటుకున్న రైడర్ కు మరోసారి జాతీయ జట్టు పిలుపు అందడం ఖాయమని క్రికెట్ పండితులంటున్నారు.

  • Loading...

More Telugu News