: చైనాను ప్రసన్నం చేసుకోవడానికి ఫేస్ బుక్ అధిపతి తిప్పలు


ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై చైనాలో నిషేధం విధించారన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వ వైఖరి ఎంత కఠినమో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. 2009 నుంచి అక్కడ ఫేస్ బుక్ పై నిషేధం కొనసాగుతోంది. అయితే, ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ మాత్రం భవిష్యత్ పై ధీమాగా ఉన్నారు. అందుకే, తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తరచుగా బీజింగ్ వెళుతూ, చైనా రాజకీయనేతలను, వ్యాపారవేత్తలను కలుస్తూ, పని చక్కబెట్టుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా బీజింగ్ వెళ్ళి, అక్కడ త్సింఘువా యూనివర్శిటీ విద్యార్థులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు, తన ప్రసంగంలో అత్యధిక భాగం చైనా అధికార భాష మాండరిన్ లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో, ఆ ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగిపోయాయి. ఈ సందర్భంగా జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ స్థాపించడానికి గల కారణాలతో పాటు, తన వ్యక్తిగత విషయాలను కూడా విద్యార్థులతో పంచుకున్నారు. తనకు నచ్చిన రంగు, నచ్చిన చైనీస్ వంటకం, తన చైనీస్-అమెరికన్ భార్య ప్రిసిల్లా చాన్ గురించి వారితో ముచ్చటించారు. అంతేగాదు, తనకు చైనా సంస్కృతిని అధ్యయనం చేయాలనుందని వెల్లడించారు. సంస్కృతి తెలుసుకోవాలంటే భాష తెలిసుండాలని, అందుకే మాండరిన్ నేర్చుకుంటున్నానని తెలిపారు. మరి, జుకెర్ బర్గ్ ప్రణాళికలు ఫలితాన్నిస్తాయో? లేదో? చూడాలి.

  • Loading...

More Telugu News