: విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్న కుబేరుల జాబితాలో యూపీఏ కేంద్రమంత్రి
విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్న వారి జాబితాలో యూపీఏ ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా చేసిన ఓ వ్యక్తి ఉన్నారని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మన్మోహన్ హయాం లోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ''నేను ధ్రువీకరించడం లేదు... అలాగని ఖండించడం కూడా లేదు. నవ్వుతో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేస్తున్నానంతే. ఈ వివరాల కోసం తగిన సమయం ఆసన్నమయ్యేవరకు వేచి ఉండండి'' అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లకుబేరుల జాబితాను తాను మీడియాకు ఇవ్వలేనని, ఇస్తే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిన వాడిని అవుతానని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలను మీడియాకు లీక్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అభియోగాలను రుజువు చేయగలిగినప్పుడు మాత్రమే కోర్టుకు పేర్లను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఇటువంటి వ్యవహారాల్లో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయన్న వాదనను ఆయన తప్పుపట్టారు. ''ఈ వాదన పూర్తిగా తప్పని, సాధారణంగా వైరి పార్టీలోని వ్యక్తుల పేర్లు స్కాముల్లో ఉంటే బయటపెట్టడానికి బాగా ఆసక్తి చూపిస్తారు కదా?'' అని ఆయన అన్నారు.