: ఆంధ్రా వారి ఇళ్లకు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం: టీఆర్ఎస్
మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సునీతతో పాటు ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వారు చంద్రబాబునాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ విషయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్రానికి సాయం చేస్తానంటూనే, మరో వైపు తెలంగాణకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వారు ధ్వజమెత్తారు. అవసరమనుకుంటే హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఇళ్లకు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేసేందుకు వెనుకాడమని వారు హెచ్చరించారు.