: తెలంగాణ రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తా: చంద్రబాబు
కృష్ణా జిల్లా పర్యటనలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విరుచుకుపడ్డారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా తనపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజల కష్టాలు తీరవని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని...ఇలాగైతే ఎండాకాలంలో తాగడానికి ఇరు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఉండవని... ఈ ఉద్దేశంతోనే, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించానన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వడానికి తాను సంసిద్ధత వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఓ మంచి ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తే, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంట్ కోతలపై ఐదు నెలల నుంచి టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ, మాయమాటలు చెబుతూ తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తగవుల్లో కాకుండా, అభివృద్ధిలో తనతో పోటీపడాలని ఆయన చాలెంజ్ విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు రెండూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.