: వ్యభిచారం చేసిందని రాళ్ళతో కొట్టి చంపారు... ఐఎస్ఐఎస్ మరో ఘాతుకం
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి తెగబడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్ కు చెందిన మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను రాళ్ళతో కొట్టి చంపారు. ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేశారు. ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది. వారి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ కూడా కనిపిస్తాడు. ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా, అతడు నిరాకరించినట్టు వీడియోలో వెల్లడైంది. క్షమిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుందని, క్షమించాలని మిలిటెంట్ చెప్పినా, ఆమె తండ్రి నిరాకరించాడు. అంతేగాకుండా, ఆ కిరాతక తండ్రే రాళ్ళను పోగు చేశాడు. ఆ రాళ్ళతోనే ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆమెను చనిపోయేదాకా కొట్టారు.