: మోడీ టపాసుల ధాటికి తుస్సుమంటున్న లాలూ, నితీశ్ టపాసులు!


దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాదిరే బీహార్లోనూ దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే, అక్కడి బాణాసంచా తయారీ కంపెనీలు టపాసులను ప్రముఖ రాజకీయవేత్తల పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టాయి. మోడీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి దిగ్గజాల పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేశాయి. వీటన్నింటిలోకి మోడీ టపాసులే బాగా అమ్ముడవుతున్నాయట. మోడీ రాకెట్లు, మోడీ చక్రాలు, మోడీ బాంబులు... ఇలా, మోడీ పేరుతో ఉన్న టపాసులను కొనుగోలు చేసేందుకే ప్రజలు మొగ్గుచూపడం విశేషం. దీనిపై, ఓల్డ్ పాట్నాకు చెందిన రమేశ్ కుమార్ అనే దుకాణదారు మాట్లాడుతూ, మోడీ పేరు రాజకీయాల్లోనే కాదు, టపాసుల అమ్మకాల్లోనూ టాప్ లేపుతోంది అని పేర్కొన్నారు. మరో దుకాణదారు గుడ్డు అన్సారి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. 'మోడీ మ్యాజిక్' మార్కెట్ ను శాసిస్తోందని అన్నారు. భోలాసింగ్ అనే బాణాసంచా విక్రయదారు మాట్లాడుతూ, మోడీ పేరుతో ఉన్న ఐటమ్స్ అన్నీ వేగంగా అమ్ముడవుతున్నాయని... ఈ పర్యాయం లాలూ, నితీశ్ పేరిట మార్కెట్లో ఉన్న టపాసులకు గిరాకీ తగ్గిందని అభిప్రాయపడ్డారు. దుకాణానికి వచ్చే వినియోగదారులు తొలుత మోడీ పేరుతో ఉన్న టపాసులనే అడుగుతున్నారని సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News