: నటుడు ఆశిష్ విద్యార్థి నదిలో మునక... కాపాడిన పోలీసు
దక్షిణాది ప్రేక్షకులకు బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి (52) సుపరిచితమే. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించారాయన. తాజాగా, 'బాలీవుడ్ డైరీ' సినిమాలో నటిస్తున్న ఆశిష్ విద్యార్థి ఓ ప్రమాదం నుంచి గట్టెక్కారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఛత్తీస్ గఢ్ లోని శివనాథ్ నది వద్ద జరుగుతోంది. ఆయన నదిలో దిగి ఉండగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ప్రవాహ వేగానికి ఆశిష్ విద్యార్థి నీళ్ళలో పడిపోయి, మునిగిపోతుండడంతో యూనిట్లో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయానికి సెట్స్ పై ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ వెంటనే నదిలో దూకి, ఆశిష్ విద్యార్థిని ఒడ్డుకు చేర్చాడు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై, నటుడు మనోజ్ బాజ్ పాయ్ ట్విట్టర్లో స్పందించారు. నదిలో మునిగిపోతున్న తన స్నేహితుడు ఆశిష్ విద్యార్థిని ఓ పోలీసు కాపాడాడంటూ, ఆ పోలీసుకు సెల్యూట్ చేశాడు.