: ఐపీఎల్ లో ఆడేందుకు విండీస్ క్రికెటర్లకు 'నో అబ్జెక్షన్'
టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అవకాశం కోల్పోయిన వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ పాలక మండలి ఊరటనిచ్చింది. ఐపీఎల్-8లో వారు ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ స్పష్టం చేశారు. భారత పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశం వెళ్ళిపోయిన విండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తలుపులు కూడా మూసుకుపోయినట్టేనని అందరూ భావించారు. వారితో ఇక ద్వైపాక్షిక సిరీస్ లు ఆడరాదని బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, విండీస్ క్రికెటర్లు లేకపోతే ఐపీఎల్ కళ తప్పుతుందని భావించిన బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం రంజీబ్ బిశ్వాల్ మాట్లాడుతూ, "వెస్టిండీస్ ఆటగాళ్ళు ఐపీఎల్లో ఆడనున్నారు" అని పేర్కొన్నారు. లీగ్ లో ఆడేందుకు వారిని అడ్డుకోబోమని స్పష్టీకరించారు.