: దీపావళి వస్తే ఉత్తరాఖండ్ లో గుడ్లగూబలకు మూడినట్టే!


భారత్ లో మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదు. జంతు బలులు, క్షుద్రపూజలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉత్తరాఖండ్ లో అయితే దీపావళి సందర్భంగా గుడ్లగూబలను బలివ్వడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. ఈ పండుగ సందర్భంగా గుడ్లగూబను బలిస్తే కోర్కెలు ఈడేరతాయన్నది అక్కడివారి నమ్మిక. దీపావళి వస్తుందంటే చాలు గుడ్లగూబలకు అక్కడ కష్టకాలం మొదలైనట్టే. వేటగాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో అడవుల్లోకి బయల్దేరతారు. ఎందుకంటే, ఒక్కో గుడ్లగూబ కనీసం రూ.20,000 ధర పలుకుతుంది. నాలుగు కేజీల కంటే అధిక బరువున్న గుడ్లగూబ అయితే రూ.5 నుంచి రూ.7 లక్షల ధర చెల్లించడానికి కూడా వెనుకాడరట అక్కడి వాళ్ళు. దీంతో, వేటగాళ్ళు గుడ్లగూబ కనిపిస్తే చాలు పట్టుకునేదాకా విశ్రమించడంలేదు. ఉత్తరాఖండ్ ప్రజల మూఢనమ్మకం ఆ అరుదైన పక్షిజాతికి పెను ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ వాటి భద్రత కోసం పటిష్ఠ చర్యలకు శ్రీకారం చుట్టింది. వేటగాళ్ళను పట్టుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసింది. స్థానిక మార్కెట్లపైనా ఓ కన్నేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూఢాచారాన్ని రూపుమాపేందుకు తాము పోలీసు శాఖ సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పరాగ్ మధుకర్ ధకాటే చెప్పారు.

  • Loading...

More Telugu News