: పోలీసులను కించపరిచేలా చూపడం సరికాదు: తెలంగాణ సీఎం
చలన చిత్రాల్లో పోలీసులను కించపరిచేలా చూపడం సరికాదని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు అన్నారు. అంతేకాక పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం అటు మీడియాతో పాటు ఇటు చిత్ర పరిశ్రమకు కూడా తగదని ఆయన సూచించారు. మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషా మహల్ స్టేడియంలో ఆయన పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. సమాజ రక్షణ బాధ్యతలు నెరవేరుస్తున్న పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికే మంచిది కాదన్నారు. సమాజ రక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరుల త్యాగాలు అమూల్యమైనవని ఆయన కీర్తించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వందశాతం అండగా ఉంటుందన్నారు. భద్రత ఉంటే పెట్టుబడులు వస్తాయన్న ఆయన రాష్ట్రంలో సింగపూర్ తరహాలో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.