: చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చేసిన దొంగ


కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఓ దొంగలో పశ్చాత్తాపాన్ని ఆశించగలమా? అంటే, చాలా కష్టం అన్న జవాబే ఎక్కువగా వినవస్తుంది. కానీ, ఓ దొంగ తాను కొట్టేసిన మొత్తాన్ని తిరిగి సొంతదారు వద్దకు చేర్చిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భోపాల్లో లక్ష్మణ్ మూల్ చందాని (49) పనిముట్లు విక్రయిస్తుంటాడు. భైరాగఢ్ మార్కెట్లో అతనికో దుకాణం ఉంది. కిందటి మంగళవారం ఎప్పట్లానే షాపు మూతవేసి ఇంటికి బయల్దేరాడు. సాధు వశ్వాని కాలేజి సమీపంలోకి రాగానే, ఓ దుండగుడు మూల్ చందానిపై దాడి చేసి అతని చేతిలో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్ళిపోయాడు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు మొదలు పెట్టారు. అనుమానితులను ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉంటే, ఆదివారం నాడు మూల్ చందాని సోదరుడు జవహర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు కమలేశ్ అని, మూల్ చందాని బ్యాగు ఎత్తుకెళ్ళింది తానేనని ఫోన్ చేసిన వ్యక్తి వివరించాడు. తానా బ్యాగును మాంఝి నగర్లోని ఓ ఇంట్లో ఉంచానని, వెళ్ళి తెచ్చుకోండని చెప్పాడు. మూల్ చందాని ఈ సమాచారాన్ని భైరాగఢ్ పోలీసులకు తెలపగా, ఎంతో ప్రయత్నించిన మీదట ఆ బ్యాగు ఓ నిర్జన గృహంలో లభ్యమైంది. ఇక, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు ఆరా తీయగా, నద్రా బస్టాండ్ సమీపంలోని ఓ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చిందన్న విషయం తేలింది. దొరికిపోతానన్న ఒత్తిడిలోనే దొంగ బ్యాగును తిరిగి ఇచ్చేశాడని పోలీసులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News