: 'గాంగ్నమ్ స్టైల్' తరహాలో చైనాను ఊపేస్తున్న పాట ఇదే
దక్షిణకొరియా గాయకుడు 'సై' కేవలం ఒక్క పాటతో గ్లోబల్ పాప్యులారిటీ సొంతం చేసుకున్నాడు. సై ఆలపించిన గాంగ్నమ్ స్టైల్ గీతం ఆన్ లైన్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడదే తరహాలో చైనాలోనూ ఓ పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఆ గీతం పేరు 'లిటిల్ ఆపిల్'. 'చాప్ స్టిక్ బ్రదర్స్' పేరిట జియావో యాంగ్, వాంగ్ తైలీ రూపొందించిన ఈ గీతం వాస్తవానికి వారి సినిమా ప్రమోషన్ కోసం రూపొందించినది. జులైలో సినిమా విడుదల కాగా, సినిమా కంటే ఈ సాంగే ప్రజాదరణ పొందింది. క్యాచీ ట్యూన్, విచిత్రమైన పదాలతో తమాషాగా సాగే ఈ పాట వివిధ వర్గాల ప్రజల్లోకి త్వరగా చొచ్చుకెళ్ళింది. సోహు, ఇకియి, యౌకు వంటి చైనా వీడియో సైట్లలో ఈ పాట ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాటను వివిధ వర్గాలు తమకు అనుకూలంగా పారడీ చేసుకోవడం విశేషం. రిక్రూట్ మెంట్ సందర్భంగా జియాన్ నగరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ పాటను తమ రిక్రూట్ మెంట్ వీడియోలో వినియోగించుకుంది. ఇక, షాంగ్ డాండ్ పోలీసులైతే ఈ పాటలో పదాలను మార్చివేసి, ఫోన్ బ్యాంకింగ్ స్కాంలపై ఓ హెచ్చరిక గీతాన్ని ప్రసారం చేశారు.