: రాహుల్ ప్రాభవం... వెలగక ముందే ఆరిపోతోందా?
కాంగ్రెస్ యువరాజుగా పరిగణిస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాభవం అసలు వెలగకముందే, ఆరిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన రాహుల్ గాంధీ, పార్టీకి పరాజయాన్నే అందించారు. అంతేనా.. నిన్నటి మహరాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం ఏమాత్రం కనిపించకపోగా, పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే దిశగా ఘోర పరాజయం పాలైంది. కేంద్రంలో లాగే, మహారాష్ట్ర, హర్యానాల్లోనూ నిన్నటిదాకా ఆ పార్టీ ప్రభుత్వాలే కొనసాగాయి. అయితే, ఒక్క రాష్ట్రంలోనూ రాహుల్, తమ పార్టీ అధికారాన్ని నిలబెట్టలేకపోయారు. దీంతో, నిన్నటిదాకా యువరాజంటూ కీర్తించిన పార్టీ శ్రేణులే, నేడు రాహుల్ ను ఎందుకూ కొరగాని వాడిగా పరిగణిస్తున్నాయి. అంతేగాక, పార్టీకి పూర్వ వైభవం రావాలంటే సోనియా గాంధీ కూతురు ప్రియాంకా రావాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య పార్టీలో నానాటికీ పెరిగిపోతోంది. ఈ తరహా పరిణామాలు రాహుల్ ప్రాభవం కొడిగడుతున్నాయని చెప్పడం కాక మరేమిటని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.