: అమిత్ షా...దేశంలోనే అత్యంత ప్రభావశీల రాజకీయవేత్తల్లో రెండో వ్యక్తి!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, దేశంలోనే అత్యంత ప్రభావశీల రాజకీయ వేత్తల్లో రెండో వ్యక్తిగా అవతరించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు, తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపిన ఆయన తాజాగా ఈ స్థానానికి ఎగబాకారు. ఇక ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్ షా, బీజేపీలో కూడా తన ప్రాధాన్యాన్ని రెండో స్థానానికి పెంచుకున్నారు. సాధారణంగా నాలుగు నెలల పాలనతో మోడీ ఒక్కరే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపడం సాధ్యమయ్యేది కాదని విశ్లేషకుల వాదన. మహారాష్ట్ర విషయానికొస్తే, శివసేనతో తెగదెంపులు చేసుకుని ఒంటరి పోరుకు సిద్ధమైన అమిత్ షా ముందు చూపు అక్కడి ఓటర్లను బాగా ఆకట్టుకుంది. అదే హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటులో తనదే కీలక పాత్ర అంటూ బీరాలు పలికిన హర్యానా జనహిత కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ తో చర్చల సందర్భంగా... పొత్తు పెట్టుకుంటే, 25 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన అమిత్ షా, ముందస్తు అంచనాలు కూడా పార్టీని విజయబాట పట్టించాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీ విజయాలకు ఇవే కారణాలుగా నిలిచాయి.