: హర్యానా ఎన్నికల్లో ఓటమిపాలైన 'అత్యంత ధనిక మహిళ'
ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైతే ఎంతటివారికైనా ఎన్నికల్లో ఓటమి తప్పదు. దేశంలో అత్యంత ధనిక మహిళగా పేరుగాంచిన సావిత్రి జిందాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. హిసార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సావిత్రి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో 13,646 ఓట్ల తేడాతో చిత్తయ్యారు. పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు నవీన్ జిందాల్ కు సావిత్రి తల్లి. తొలిసారిగా, 2008లో ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత్ లో అత్యంత ధనిక మహిళగా సావిత్రికి ప్రథమ స్థానం కేటాయించింది. ఫోర్బ్స్ తాజా ఎడిషన్లోనూ సావిత్రి తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూపుకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న సావిత్రి కుటుంబ నెట్ వర్త్ రూ.395 బిలియన్లు. ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రికి 12వ స్థానం లభించింది. ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, లక్ష్మీ మిట్టల్ తదితరులున్నారు.