: తోడి కోడళ్ల మధ్య ‘ఉపాధి’ పోరు!
సోనియా గాంధీ, మేనకా గాంధీ... పేరుకే తోడి కోడళ్లు. ఆది నుంచి ఇద్దరిదీ చేరో దారి. ఒకరు కాంగ్రెస్ అధినేత్రిగా ఎదిగితే, మరొకరు బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే చాలు మంత్రి పదవి కొట్టేస్తారు. సోనియా గాంధీ, మేనకా గాంధీలు తోడి కోడళ్లైనా ఏనాడూ కలిసింది లేదు. కలవకపోయినా ఫరవా లేదు, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోకుండా ఉంటే చాలనుకుంటే, అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం భీకరంగానే సాగుతూనే ఉంది. తాజాగా గత యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించిన మేనకా గాంధీ మరోసారి మాటల యుద్ధానికి తెర లేపారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిని ప్రస్తావించిన మేనక, దేశంలో అత్యంత ఖరీదైన విఫల పథకంగా ఉపాధి హామీ పథకం కీర్తిగాంచిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పథకంలో భాగంగా ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు దోచుకుతిన్నా, యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని విరుచుకుపడ్డారు. మరి దీనిపై సోనియా బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.