: పారదర్శకతకు వెంకయ్య పెద్ద పీట!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముక్కుసూటిగా వ్యవహరించే రాజకీయ వేత్త. వివాదాలు ఆయన దరి చేరవు. ఏ పని చేసినా పక్కాగా, ఏమాత్రం ఆరోపణలు లేకుండా సాగిపోతారు. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆయన తన ఆధ్వర్యంలోని పట్టణాభివృద్ధి శాఖలో మరింత పారదర్శకతకు ఆయన శ్రీకారం చుట్టారు. తద్వారా జవాబుదారీ పాలనకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ అడుగుజాడల్లో ముందుగా తానే నడుస్తానని చెప్పకనే చెప్పారు. అసలు విషయమేంటంటే, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) పనిచేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రధాన నగరాల్లో ఈ శాఖ పనులు చేస్తోంది. అయితే ఇటీవల ఈ శాఖ చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై గత నెలలో జరిగిన సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు, అసలు జాప్యం ఎందుకు జరుగుతోంది, ఏఏ రాష్ట్రాల్లో ఎన్నేసి పనులు నత్తనడకన నడస్తున్నాయి, సదరు పనుల కోసం ఎంత మేర నిధులను కేటాయించారు, ఇప్పటిదాకా ఎంతమేర ఖర్చైంది? అన్న వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. తాజాగా మంత్రి వెంకయ్యనాయుడు ఆదేశాలను అమలు చేసిన అధికారులు సీపీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో జరుగుతున్న రూ. 40 వేల కోట్లకు పైగా విలువైన 7,676 పనులకు సంబంధించిన వివరాలను పట్టణాభివృద్ధి శాఖ వెబ్ సైట్ లో పెట్టారు.