: రాముడి గుడి నిర్మించేందుకు మోడీ ప్రభుత్వానికి సమయం ఇద్దాం!: ఆర్ఎస్ఎస్
అయోధ్యలో రాముడి దేవాలయం నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి ప్రజలు మరింత సమయం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఈలోగా ప్రభుత్వం అందుకు కసరత్తు పూర్తి చేయడానికి వీలుగా ఉంటుందని సంఘ్ అంటోంది. లక్నోలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ 'ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ' సమావేశాల్లో షా సర్కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలె మాట్లాడుతూ, రామ టెంపుల్ అజెండా అనేది ఈ దేశ ప్రజలదనీ, దీనిపై బీజేపీని ఆర్ఎస్ఎస్ అడగాల్సిన అవసరం లేదనీ అన్నారు. ఎందుకంటే గుడి నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి 2019 వరకు సమయం ఉందని, దానికి ముందుగా ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన పనులు మొదట చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఐదేళ్ల సమయం ఉన్న ప్రభుత్వం తన ప్రాధాన్యతలేవో ముందు నిర్ణయించుకుంటుందన్నారు. కాబట్టి, ఈ విషయంపై ప్రజలు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని షా కోరారు.