: మనకూ ఓ మలాలా ఉంది!
మలాలా యూసఫ్ జాయ్... నోబెల్ శాంతి బహుమతి సంయుక్త విజేత. పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో బాలికల విద్యా హక్కు కోసం తాలిబాన్ల బుల్లెట్లకు సైతం వెరవకుండా పోరాడిన సాహసబాలికగా మలాలా పేరు ప్రపంచవ్యాప్తమైంది. ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ దక్కడంతో ఆ పేరు మరింత మార్మోగిపోయింది. ఆమె తరహాలోనే భారత్ లోనూ ఓ అమ్మాయి బాలికల కోసం పోరాడుతోంది. పశ్చిమబెంగాల్లోని సందేశ్కలి ప్రాంతంలో బాలికల అక్రమ రవాణ ఎక్కువగా జరుగుతోంది. దీనిపై అనోయారా ఖాతూన్ (18) అనే టీనేజి బాలిక మడమతిప్పని పోరాటం సాగిస్తోంది. అక్రమ రవాణా, బాల్య వివాహాలు తదితర సమస్యలపై అనోయారా యువతను కూడగట్టడంతో పాటు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో ఓ బలమైన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. మలాలాకు చెందిన 'మలాలా ఫండ్' ఫేస్ బుక్ పేజీలో అనోయారా పోరును గుర్తిస్తూ, ఆమె గురించి ప్రస్తావించారు. ఆమె 180 మందికి పైగా అక్రమ రవాణాకు గురైన బాలికలను వారి కుటుంబాల వద్దకు చేర్చిందని, 35 బాల్య వివాహాలను అడ్డుకుందని, 85 మంద బాలికలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించిందని ఆ పేజీల్లో పేర్కొన్నారు. మలాలాకు నోబెల్ అవార్డు ప్రకటించిన అక్టోబరు 13నే మలాలా ఫండ్ ఫేస్ బుక్ పేజీలో అనోయారా గురించి పోస్టు పెట్టారు. ఆ రోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ఆ పోస్టులో అనోయారాను 'ఏ ట్రూ గాళ్ హీరో' అని అభివర్ణించడం విశేషం.