: అన్నా డీఎంకేలో మిన్నంటిన సంబరాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో షరతులతో కూడిన బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె పార్టీ అన్నా డీఎంకే కార్యకర్తల్లో సంబరాలు మిన్నంటాయి. సరిగ్గా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే జయకు బెయిల్ లభించడంతో సంబరాలు హోరెత్తుతున్నాయి. జయలలితకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా ఉత్సాహాన్ని నింపింది. జయ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సంబరాలే వద్దకునుకున్న కార్యకర్తలు, జయకు బెయిల్ రావడంతో భారీ ఎత్తున సంబరాలకు తెర తీశారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ సంబరాల హోరు క్రమంగా తమిళనాడును ముంచెత్తనుంది.