: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ!
అరకొర మంత్రులతోనే నెట్టుకొస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించనున్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోగానే పూర్తి స్థాయిలో కేబినెట్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ తదితర మంత్రులు తమ శాఖలతో పాటు కీలక శాఖల బాధ్యతలను అదనంగా భుజాన వేసుకున్నారు. దీంతో రెండు శాఖల నిర్వహణ వారికి కష్టసాధ్యంగా పరిణమించిందనే భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మరింత వేగంగా దూసుకెళ్లేందుకు పూర్తి స్థాయి కేబినెట్ అవసరమన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణకు మోడీ దాదాపుగా నిర్ణయించినట్టు సమాచారం. రానున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో కీలక భూమిక పోషిస్తున్న భూమిహార్ సామాజిక వర్గానికి ప్రస్తుతం కేబినెట్ లో చోటు లేదు. హర్యానాలో కీలకమైన జాట్ సామాజిక వర్గానికి కూడా మోడీ కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇక తనతో సుదీర్ఘ మైత్రిని వీడిన శివసేనకు చెందిన అనంత్ గీతే, కేబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. శివసేనతో తెగదెంపుల నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, బడ్జెట్ లో తన మార్కు రూపకల్పనకు నడుం బిగించిన మోడీ, ఆర్థిక సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్తగా పేరుగాంచిన అరవింద్ సుబ్రహ్మణియన్ ను నియమించారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా యూపీఏ నియమించిన మయారామ్ ను బదిలీ చేసి, ఆ స్థానంలో రాజీవ్ మెహరిషిని నియమించారు. పాలనలో మరింత దూకుడును పెంచాలని భావిస్తున్న మోడీ, త్వరలోనే మంత్రి మండలి విస్తరణను పూర్తి చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది.