: 70 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లితే...వెయ్యి కోట్లిస్తారా? : పద్మరాజు
హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 70 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లితే వెయ్యి కోట్లు విడుదల చేస్తే అవి ఏ మూలకు సరిపోతాయని ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తుపాను బాధితులకు తక్షణ సాయంగా 5 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు పంటను బీమా చేసుకునే అవకాశం కోల్పోయారని, ఈ కారణంగా వారు మరింత నష్టపోయారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక అందజేయాలని వారు సూచించారు.