: పసిపిల్లల అదృశ్యానికి సీఎస్, డీజీపీలదే బాధ్యత: సత్యార్థి పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు
పసిపిల్లల అదృశ్యానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు డీజీపీలే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు గురువారం బీహార్, చత్తీస్ ఘడ్ ల సీఎస్ లతో పాటు డీజీపీలు కూడా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యార్థి పసిపిల్లల అదృశ్యంపై దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఈ తరహా పిటిషన్లపై తమాషా సమాధానాలు చెబుతోందని, ఈ కారణంగానే ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2011 నుంచి 2014 దాకా దేశవ్యాప్తంగా 3,27,658 మంది పిల్లలు కనపడకుండా పోయారు. వారిలో 1,81,011 మంది పిల్లలు బాలికలు కాగా, 1,46,647 మంది బాలలు ఉన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో అత్యధిక సంఖ్యలో పిల్లలు అదృశ్యమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 50,947 మంది, ఆంధ్రప్రదేశ్ లో 18,540 మంది పిల్లలు కనపడకుండా పోయారు.