: సిగరెట్ పెట్టెలపై ఇక 85 శాతం స్థలంలో హెచ్చరికలే!
ధూమపాన ప్రియులకు ఇది చేదు వార్తే. ఇకపై మీరు కొనుగోలు చేసే సిగరెట్ పెట్టలపై 85 శాతం ప్రదేశంలో కేవలం హెచ్చరికలు మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం సిగరెట్ బాక్సులపై హెచ్చరికలతో కూడిన ఓ చిత్రం కనిపిస్తోంది. అది కూడా సిగరెట్ పెట్టెపై కేవలం 40 శాతం ప్రదేశంలో మాత్రమే. తాజాగా సిగరెట్ పెట్టే దాదాపు పూర్తి స్థాయి స్థలంలో ఈ తరహా హెచ్చరికలే ముద్రించాలని కేంద్రం సిగరెట్ తయారీ కంపెనీలను ఆదేశించనుంది. దీనిని తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనగానూ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబందించి బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై సిగరెట్ పెట్టెపై 60 శాతం ప్రదేశం బొమ్మలతో కూడిన హెచ్చరికలు, 25 శాతం స్థలంలో రాత సంబంధిత హెచ్చరిలను ముద్రించాల్సి ఉంది. ‘పొగాకు అంటేనే మరణం’ అనే సందేశాన్ని ప్రచారం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది.