: ఇకపై నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లో కాదు, ఇందిరా పార్కులో!
హైదరాబాదులో ఇకపై గణేష్, దుర్గామాత, బతుకమ్మ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లో నిర్వహించరు. ఇందిరా పార్కులో నిమజ్జనాలు నిర్వహించాలి. అదేంటి? అక్కడ నీరెక్కడుంది? ఎలా నిమజ్జనం చేస్తామని సందేహం వచ్చిందా? ఇందిరా పార్కులో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సరస్సును నిర్మించనుంది. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ ను గత ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయని చాలా మధనపడ్డారు. హుస్సేన్ సాగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని తలంచారు. దీంతో తక్షణం అధికారులతో సమావేశమయ్యారు. ఇకపై హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు నిర్వహించకూడదని, నిమజ్జనాల కోసం ఇందిరాపార్కులో ఓ సరస్సు నిర్మించాలని ఆయన ఆదేశించారు. హుస్సేన్ సాగర్ ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. వెంటనే గ్రేటర్ నేతలతో సమావేశమై హుస్సేన్ సాగర్ పై భవిష్యత్ లో తీసుకునే చర్యలను వివరించారు. వారు కూడా ఆమోదముద్ర వేయడంతో సీఎం వెంటనే హుస్సేన్ సాగర్ లో మురుగు నీరు కలవకుండా కాల్వలు నిర్మించాలని ఆదేశాలిచ్చారు. హుస్సేన్ సాగర్ ను పరిశుభ్రంగా మారుస్తామని ఆయన వివరించారు.