: మా తిండి తినడం తెలిసినప్పుడు, కన్నడ భాష కూడా తెలిసుండాలి: బెంగళూరులో మణిపూర్ విద్యార్థిపై దాష్టీకం


దక్షిణాది రాష్ట్రాల్లో మితిమీరిన భాషాభిమానం దుష్పరిణామాలకు దారితీస్తోంది. తాజాగా, బెంగళూరులో ఓ మణిపూర్ విద్యార్థిపై దాడి జరిగింది. మణిపూరీ తెగ తడౌ విద్యార్థి సంఘానికి నాయకుడైన మైకేల్ లమ్జాతోంగ్ హావోకిప్ ను మంగళవారం రాత్రి కొందరు దుండగులు తీవ్రంగా కొట్టారు. నగరంలోని కొత్తనూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి సమయంలో మైకేల్ తో పాటు అతని స్నేహితులు ఎన్గామ్ ఖోలెన్ హావోకిప్, రాకీ కిప్జెన్ లకు స్వల్ప గాయాలయ్యాయి. దుండగులు తమను కన్నడలోనే మాట్లాడాలని ఒత్తిడి చేశారని తీవ్రంగా గాయపడ్డ మైకేల్ పోలీసులకు తెలిపాడు. రక్తమోడుతున్న స్థితిలోనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మైకేల్ పోలీసులకు వివరాలు తెలిపాడు. "వారు నన్ను కన్నడలో మాట్లాడాలని అడుగుతూనే ఉన్నారు. 'మీకు కర్ణాటకలో తయారైన తిండి తినడం తెలిసినప్పుడు, ఇక్కడి భాష కూడా తెలిసుండాలి. ఇది ఇండియా, చైనా కాదు' అన్నారు వాళ్ళు. వాళ్ళకి సర్ది చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. అయినా, వాళ్ళు ఆవేశంతో ఊగిపోతూ మాపై దాడి చేశారు" అని వివరించాడు. కాగా, కొత్తనూర్ ప్రాంతంలో పరాయి రాష్ట్రాల విద్యార్థులపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా అక్కడ ఎన్నోమార్లు దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, ఆఫ్రికా విద్యార్థులు నివసిస్తుంటారు.

  • Loading...

More Telugu News