: అవమానాన్ని పక్కనబెట్టి, ఆలయానికి నిధులు మంజూరు చేసిన బీహార్ సీఎం
బీహార్ సీఎం జితన్ రామ్ మంఝి ఇటీవలే 'మా పరమేశ్వరి' ఆలయాన్ని సందర్శించి వెళ్ళిన తర్వాత, ఆ ఆలయాన్ని 'శుద్ధి' చేయడం వివాదాస్పదమైంది. కుల వివక్షతోనే అలాంటి చర్యలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అవమానించారని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అయితే, జితన్ రామ్ దీనిపై విచారణకు ఆదేశించి, విషయాన్ని అంతటితో వదిలేశారు. తనకు ఎదురైన అవమానాన్ని పట్టించుకోకుండా, తాజాగా, ఆ ఆలయం అభివృద్ధి కోసం రూ.55 లక్షలు మంజూరు చేశారు. 'మా పరమేశ్వరి' ఆలయాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలంటూ మంత్రులు నితీశ్ మిశ్రా, రామ్ లఖన్ రామ్ రమణ్ తదితర జేడీ(యూ) నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. వారితో సమావేశం అనంతరం ఆయన నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.