: పోలింగ్ నేపథ్యంలో ఎంచక్కా బ్యాడ్మింటన్ ఆడిన హర్యానా సీఎం
ఏ రాష్ట్రానికైనా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే పోలింగ్ రోజున ముఖ్యమంత్రి ఎంత టెన్షన్ తో ఉంటారో తెలియంది కాదు. పార్టీ అభ్యర్థులకు సూచనలు చేయడం, పరిస్థితులను సమీక్షించడం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. అన్నింటినీ మించి గెలుస్తామో, లేదో అన్న చింత వారిని వేధిస్తుంటుంది. కానీ, హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా మాత్రం గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అందుకేనేమో, నేడు పోలింగ్ అని తెలిసి కూడా, ఆయన ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా విజయభేరి మోగించడం ఖాయమని చెప్పారు. "అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్ సభ ఎన్నికలు పూర్తిగా విభిన్నం. ఇక్కడ మోడీయేమీ సీఎం పదవికి పోటీ చేయడంలేదు. ఓ ప్రధాని ఈ స్థాయిలో ప్రచారం చేయడాన్ని మొదటిసారి చూస్తున్నా. ఆయన తీరు చూస్తుంటే హర్యానా సీఎం పీఠం కోసం పోటీపడుతున్నట్టుగా ఉంది" అని హుడా వ్యాఖ్యానించారు.